చివరిగా నవీకరించబడింది:
ఆదిలాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి నాటుసారా తరలించేందుకు ప్రత్యేక చొక్కా కుట్టించుకున్నాడు. ఎక్సైజ్ పోలీసులు తనిఖీల్లో 32 సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.
సాధారణంగా మనం చొక్కాకి.. ఒకటి లేదా రెండు జేబులు ఉంటే చాలు అనుకుంటాం. కొందరైతే అంతకన్నా ముందుచూపుతో లోపలికి మరొక జేబు కుట్టించుకుంటారు. అది తమ డబ్బులు, విలువైన వస్తువులు సురక్షితంగా ఉండాలని. కానీ ఆదిలాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి చొక్కా జేబుల వాడకానికి కొత్త డెఫినిషన్ ఇచ్చాడు. అదికూడా నాటుసారా తరలించేందుకు. అదేంటీ చొక్కా వేసుకోగా.. అందులో నాటు సారా దాచడం ఏంటని అనుకుంటున్నారా.. దీని గురించి తెలియాలంటే ఈ కథనం మొత్తం చదవాల్సిందే.
ఆదిలాబాద్ జిల్లాలో ఎక్సైజ్ పోలీసులు ఇటీవల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గంజాయి, నాటుసారా, గుట్కా తరలింపులపై ఉక్కుపాదం మోస్తున్నారు. ఇందులో భాగంగా భోరజ్ మండలం, తాంసి మండలం, ఆదిలాబాద్ గ్రామీణ ప్రాంతాల్లో దాడులు చేసి ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. ముగ్గురు కలిసి నాటుసారాను గుట్టుగా విక్రయిస్తూ పోలీసుల కంటపడకుండా తప్పించుకుంటూ వచ్చారు.
ఈ ముగ్గురిలో బీంసరి గ్రామానికి చెందిన కాకెర్ల అరుణ్ అనే వ్యక్తి మాత్రం ఏకంగా నాటుసారా సీసాల కోసం ప్రత్యేక చొక్కానే కుట్టించుకున్నాడు. చొక్కాలో జేబులే కాదు.. చక్కగా లోపల మరికొన్ని అదనపు జేబులు కుట్టించుకుని అందులో నాటుసారా సీసాలు పెట్టుకొని బయటకు వెళ్లేవాడు. ఎవరూ అనుమానం పడకుండా జాగ్రత్త పడ్డాడు.
కానీ ఎక్సైజ్ పోలీసుల దగ్గర అతని పప్పులు ఉడకలేదు. అనుమానం వచ్చిన పోలీసులు అతడి చొక్కా విప్పి చూసే సరికి నిజమే బయటపడింది. అతడి దగ్గర నుంచి ఏకంగా 32 నాటుసారా సీసాలు వెలికి తీశారు.
మిగతా ఇద్దరిని కూడా పోలీసులు పట్టుకుని వారి వద్ద నుంచి మరో 108 సీసాలు.. మొత్తం 140 సీసాల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ విజేందర్ మాట్లాడుతూ.. ఈ ముగ్గురిపై కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్లు తెలిపారు. చొక్కాలో దాచి మద్యాన్ని ఊహాత్మంగా తీసుకు వెళ్తున్న వ్యక్తి పోలీసులు పట్టుకున్నారు. కానీ ఈ చొక్కా కథ మాత్రం ఆదిలాబాద్‌లో ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.
తెలంగాణలోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు తెలంగాణ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Adilabad,Telangana
జూన్ 21, 2025 10:15 PM






















