ఈసారి పిఠాపురం నుంచి..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారనున్నాయి. వైసీపీని ఓడించేందుకు టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన పార్టీ 21 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయనుంది. ఇక పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై ఇప్పటి వరకు అనేక పేర్లు వినిపించినప్పటికి చివరకు ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లుగా స్వయంగా ప్రకటించుకున్నారు. పార్టీ ఆవిర్భావదినోత్సవ కార్యక్రమంలో జనసేనాని తాను పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే ఎంపీగా కూడా పోటీ చేస్తారని పార్టీ వర్గాలు, అభిమానులు భావిస్తున్నారు. అయితే దానిపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశం తనకు లేదని ..ఒకవేళ పోీ చేయాల్సి వస్తే పెద్దలను సంప్రదించిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం రెండు చోట్ల నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. జనసేన నుంచి కేవలం ఒకే ఒకరు పాలకొల్లు నియోజకవర్గం నుంచి రాపాక గెలిచి జనసేనను వీడారు. ఈసారి పవన్ కల్యాణ్ పొత్తులు ఆయనకు ఏమాత్రం కలిసి వస్తాయో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే వరకు తను విశ్రమించనని జనసైనికులు కూడా పట్టుదలగా పని చేయాలని సూచించారు పవన్ కల్యాణ్.
ఎంపీగా పోటీ చేయను..
జనసేన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్ధుల విషయంలో చాలా రోజుల క్రితం మొదటగా నాదెండ్ల మనోహర్ పేరును ప్రకటించారు పవన్ కల్యాణ్. ఇప్పుడు తనతో పాటు మరో 9మంది అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసింది జనసేన పార్టీ. జనసేన పోటీచేసే సీట్ల వివరాలు కొలిక్కి రావడంతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరో 9 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
జనసేన అభ్యర్థులు:
విశాఖ సౌత్- వంశీకృష్ణ యాదవ్
తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్
పెందుర్తి- పంచకర్ల రమేశ్,
ఎలమంచిలి- విజయకుమార్
ఉంగుటూరు- ధర్మరాజు
నరసాపురం- బొమ్మిడి నాయకర్
భీమవరం- పులపర్తి రామాంజనేయులు
రాజోలు- దేవవరప్రసాద్
తిరుపతి- ఆరణి శ్రీనివాసులు
ఖరారైనట్లు సమాచారం.
ఫస్ట్ లిస్టులో వీళ్లే..
అంతకుముందు జనసేన 5 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. టీడీపీ , జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు. జనసేన మొదటి అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే.. నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ పోటీకి దిగనున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
గుంటూర్, ఆంధ్రప్రదేశ్
మార్చి 14, 2024 3:29 PM
























