చివరిగా నవీకరించబడింది:
Banakacharla Project Dispute: ఒక ప్రాజెక్టు.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్యా చిచ్చు రేపుతోంది. రెండు ప్రభుత్వాలూ తమదైన వాదన వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై తాడేపేడో తేల్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దీని అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి.
గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు వివాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ ప్రాజెక్టు గోదావరి నది నుంచి 200 టీఎంసీ నీటిని కృష్ణా బేసిన్ ద్వారా పెన్నా బేసిన్‌కు తరలించే లక్ష్యంతో ఉంది. రూ.80,000 కోట్ల ఖర్చుతో ఏపీ ప్రభుత్వం దీన్ని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టును ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గట్టిగా సమర్థిస్తున్నారు. ఇది కేవలం వరద నీటిని మాత్రమే ఉపయోగిస్తుందని అంటున్నారు. తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టమూ జరగదని వాదిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతానికి ప్రయోజనం చేకూరుస్తుందనీ, గతంలో అనుమతులు లేకుండానే తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులను చేపట్టిందని రామానాయుడు ఆరోపించారు.
తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాజెక్టు 1980 గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్ (GWDT) అవార్డు, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (APRA) నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు గండి కొడుతుందనీ, అంతర్రాష్ట్ర జల విధానాలను ఉల్లంఘిస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వాదిస్తున్నారు.
జూన్ 13న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు లేఖ రాశారు. ప్రాజెక్టు ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ (PFR)ని తిరస్కరించాలని కోరారు. ఏపీ ప్రభుత్వం డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సమర్పించకుండా ఆపాలని కోరారు. అలాగే, ఈ ప్రాజెక్టుకు టెండర్లు ఆహ్వానించకుండా ఆపాలని డిమాండ్ చేశారు.
ఈ వివాదంపై చర్చించేందుకు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ సహా తెలంగాణకు చెందిన ఎంపీలు పాల్గోనున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో ప్రాజెక్టు ఎలా చట్ట విరుద్ధమో వివరిస్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు.
ఏపీ మంత్రి రామానాయుడు తెలంగాణ ఆరోపణలను రాజకీయ ప్రేరేపితమని అంటున్నారు. ఈ ప్రాజెక్టు కేవలం 3,000 టీఎంసీ వరద నీటిలో 200 టీఎంసీ మాత్రమే ఉపయోగిస్తుందనీ, ఇది ఎగువ రాష్ట్రాల అవసరాలను తీర్చిన తర్వాత మిగిలిన నీరు మాత్రమేనని అంటున్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని యోచిస్తోందని సమాచారం.
ఈ వివాదం రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతోంది. కేంద్రం ఈ విషయంలో ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు, కానీ ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (EAC) ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పర్యావరణ ప్రభావాన్ని అధ్యయనం చేస్తోంది.
హైదరాబాద్, తెలంగాణ
జూన్ 18, 2025 12:46 PM






















