చివరిగా నవీకరించబడింది:
పనికిరాని పత్తి కట్టెతో ఆదిలాబాద్ జిల్లాలో బయో ఫ్యూయల్ బ్రిక్స్ తయారు చేస్తూ పరిశ్రమలు లాభాలు ఆర్జిస్తున్నాయి. రైతులకు కూడా ఆదాయం వస్తోంది. పర్యావరణానికి హాని లేకుండా ఇంధనం తయారు చేస్తున్నారు.
అందరు పనికిరాదని పడేస్తున్న వ్యర్థాలతో కొందరు సంపదను సృష్టిస్తున్నారు. ఇదే కోవలోకి వస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొందరు పరిశ్రమల నిర్వాహకులు. జిల్లాలో ఎందుకు పనికి రాదని రైతులు పడేస్తున్న పత్తి కట్టెను కొనుగోలు చేస్తున్నారు. ఆదాయం పొందుతున్నారు. దీంతో రైతులకు కూడా కొంత ఆదాయం వస్తున్నా, పనికిరాని పత్తి కట్టెను కొని వారు ఏం చేస్తారనే అనుమానం రావచ్చు. ఆ అనుమానం తీరాలంటే ఇది చూడండి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పంట పత్తి. పత్తి కోత తర్వాత పొలంలో మిగిలిన పత్తి కట్టెను తొలగించడం రైతులకు ఓ సమస్యగా మారింది. కొందరు రైతులు కూలీలను పెట్టి పొలంలోని పత్తి కట్టెను ఏరిపించి, కుప్పలుగా పోసి తగులబెడుతున్నారు. ఇలా చేయడం వల్ల పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నారు. అంతే కాదు, గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశం కూడా లేకపోలేదని కొందరు అంటున్నారు. ఇప్పుడు ఆ సమస్య లేకుండా పోయింది. వ్యవసాయ వ్యర్థాలతో బయో ఫ్యూయల్ బ్రిక్స్ తయారు చేసే కొన్ని పరిశ్రమలు ఆ పత్తి కట్టెను కొనుగోలు చేస్తున్నాయి. ఇటుక బట్టీలు, టెక్స్‌టైల్ మిల్స్, సెరామిక్ ఫ్యాక్టరీలు వీటిని కొంటాయి. దీంతో ఎందుకు పనికి రాదనుకునే పత్తి కట్టె ఇప్పుడు జిల్లాలోని కొందరు రైతులకు ఆదాయ వనరుగా మారింది.
వ్యర్థమని పడేస్తున్న, తగులబెడుతున్న పత్తి కట్టెతో బయోఫ్యూయల్ బ్రిక్స్‌ను తయారు చేసి కొందరు ఆదాయాన్ని పొందుతున్నారు. పరిశ్రమలకు సరఫరా చేసి లాభాలను ఆర్జిస్తున్నారు. ఇలా పనికిరాని వ్యవసాయ వ్యర్థాలతో బయో ఫ్యూయల్ బ్రిక్స్ తయారు చేసే పరిశ్రమలు ఆదిలాబాద్ జిల్లాలో మూడు ఉన్నాయి. అందులో ఒకటి జిల్లా కేంద్రంలో ఉంది. ఇది గత నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తోంది. వీరు ఆదిలాబాద్ చుట్టుపక్కల గ్రామాల నుండి పత్తి కట్టెతోపాటు ఇతర వ్యవసాయ వ్యర్థాలను రైతుల నుండి కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో
ఒక ఎకరం పత్తి కట్టెకు మూడు నుండి ఐదు వందల రూపాయల వరకు రైతులకు చెల్లిస్తున్నారు. తీసుకువచ్చిన ఆ వ్యవసాయ వ్యర్థాలను పరిశ్రమ ఆవరణలో ఆరబెట్టి తర్వాత దాన్ని చిన్న ముక్కలు చేసి అందులో నుండి మట్టి పెళ్లలు ఉంటే తొలగిస్తారు. ఆ తర్వాత ప్రాసెసింగ్ చేసి బయో ఫ్యూయల్ బ్రిక్స్‌ను తయారు చేస్తున్నారు. కిలో బ్రిక్స్ ధర ఆరు నుండి పది రూపాయల వరకు పలుకుతోంది. బొగ్గుకు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఈ బ్రిక్స్‌ను కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు వినియోగిస్తున్నాయి. అలాంటి కంపెనీలకు ఇక్కడి నుండి ఈ బయో ఫ్యూయల్ బ్రిక్స్‌ను సరఫరా చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. దీని వల్ల పర్యావరణానికి ఏ హాని ఉండదని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు.
ఉదాహరణకు ఒక ఫ్యాక్టరీ ఎలా నడుస్తుందో చూస్తే అక్కడ రోజూ కనీసం 13 టన్నుల బ్రిక్స్ తయారు చేస్తున్నారు. అంటే 13 వేల కిలోల బ్రిక్స్ తయారవుతాయి. కిలో బ్రిక్స్ ఆరు నుండి పది రూపాయలకు విక్రయిస్తారు. కిలో ఆరు రూపాయలు అనుకున్నా రూ.78 వేల సేల్ జరుగుతుంది. 10 మంది కూలీలకు రూ.6000 కూలీ చెల్లిస్తారు. ఒక ఎకరం పత్తి కట్టెను కొంటె రైతుకు టన్నుకు 300 రూపాయలు చెల్లిస్తారు. పది కిలోల పత్తి కట్టెతో కనీసం రెండు నుండి మూడు కిలోల బ్రిక్స్ తయారవుతాయి. ముడిసరుకులో పత్తికట్టెతో పాటు ఇతర పంటలకు సంబంధించిన వేస్టేజీ కూడా ఉంటుంది. కూలీ, రా మెటీరియల్ ఖర్చులపైన లాభం ఆధారపడి ఉంటుంది. పనికిరాని పత్తి కట్టెతో ఆదాయం వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వీటితో పర్యావరణ హితమైన ఇంధనాన్ని తయారు చేసి కంపెనీలు లాభాలను ఆర్జిస్తున్నాయి.
తెలంగాణలోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు తెలంగాణ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Adilabad,Telangana
జూన్ 20, 2025 12:11 PM
























