చివరిగా నవీకరించబడింది:
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ప్రారంభించింది. ఎంపీడీఓ రాజేంద్ర బాలాజీ నేతృత్వంలో రోజూ 100 మంది మహిళలకు శిక్షణ ఇస్తున్నారు.
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో మహిళల జీవితాల్లో వెలుగు నింపేలా రాష్ట్ర ప్రభుత్వం మరో సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. ఉపాధి లేక ఇంట్లో కూర్చున్న మహిళలకు చేతి పని నేర్పించి, స్వయం ఉపాధి మార్గాన్ని చూపిస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత టైలరింగ్ శిక్షణతో మహిళలు తమ జీవితాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
వెలుగు కార్యాలయం భవనంలో ఎంపీడీఓ రాజేంద్ర బాలాజీ నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో రోజూ 100 మంది మహిళలకు నైపుణ్యం పెంచే శిక్షణను ట్రైనర్లు అందిస్తున్నారు. బేసిక్ నాలెడ్జ్ కూడా లేని మహిళలకు మిషన్ కుట్టడంతో, బ్లౌజ్ డిజైన్‌లు, ఎంబ్రాయిడరీ వంటి అంశాలపై సమగ్రమైన శిక్షణనిచ్చి, మూడునెలల తర్వాత కుట్టుమిషన్‌తో పాటు సర్టిఫికేట్‌ను కూడా అందిస్తున్నారు.
ఈ శిక్షణ పూర్తి చేసిన మహిళలు ఇక ఆత్మనిర్భరంగా తమ జీవనాన్ని సాగించేందుకు సిద్ధమవుతున్నారు. రోజుకు రెండు బ్యాచ్‌లుగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు శిక్షణ జరుగుతోంది. ప్రాక్టికల్ ట్రైనింగ్‌తో పాటు పేపర్‌పై డిజైన్ ప్రాక్టీస్ చేయించి, తర్వాతే ఫ్యాబ్రిక్‌పై కుట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారన్నది శిక్షకుల నిబద్ధతకు నిదర్శనం.
ఇది కేవలం శిక్షణ కార్యక్రమం మాత్రమే కాదు ఎంతోమందికి కొత్త ఆశలు, గుర్తింపు ఇచ్చే మార్గం. ఇది ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం, మహిళలపై చూపుతున్న గౌరవానికి ప్రతిరూపం. ఇప్పటికే ఒక నెల శిక్షణ పూర్తయ్యింది. మిగిలిన శిక్షణ పూర్తయితే తమకంటూ ఓ గుర్తింపు వస్తుంది. బ్రతకడానికి ఒక మార్గం కనిపించిందిని ట్రైనింగ్ తీసుకుంటున్న మహిళలు చెబుతున్నారు.
ఇంటివిషయాలకే పరిమితమైన తాము ఇప్పుడు బయట ప్రపంచాన్ని చూస్తున్నామని చెబుతున్నారు. ఈ అవకాశం తమకు మునుపెన్నడూ రాలేదని.. ఇప్పుడు తమ ఆత్మవిశ్వాసం పెరిగిందని ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చిన కళావతి అనే మహిళ చెబుతున్నారు. మహిళలు ఎవరి మీద ఆధారపడకుండా తమ చేతులతో తమ జీవనాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చొరవకు గ్రామీణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల మహిళలకు ఉచితంగా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించి, ఎంపిక చేసినవారికి మండలాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఇలాంటి శిక్షణా కార్యక్రమాల ద్వారా మహిళలు కేవలం నైపుణ్యం మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం కూడా పొందుతున్నారు. ఈ దిశగా మరిన్ని అవకాశాలు కల్పిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర మరింత శక్తివంతంగా మారడం ఖాయమని నిపుణులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
చిట్టూర్, చిత్తూర్, ఆంధ్రప్రదేశ్
జూన్ 19, 2025 9:48 PM
























