చివరిగా నవీకరించబడింది:
తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. రంపచోడవరం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. చనిపోయిన వారిలో గాజుల రవి, అరుణ, అంజు ఉన్నారు.
తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో పోలీసు ప్రత్యేక బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి మృతదేహాలు రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి చేరుకున్నాయి. మృతదేహాలకు సంబంధించి ఎలాంటి ఫోటోగానీ వీడియోగానీ పోలీసులు ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. మరోవైపు మీడియాను కూడా రంపచోడవరం ఆసుపత్రి లోపలికి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కట్టు దిట్టమైన భద్రత నడుమ మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడిమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. వీరిలో ప్రధానంగా గాజుల రవి తెలంగాణ భూపాలపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. 20 సంవత్సరాలుగా మావోయిస్టుగా ఆయన పని చేస్తున్నారు. ఇక అరుణ్ అక్క అలియాస్ అరుణ సుదీర్ఘకాలంగా మావోయిస్టుగా పనిచేస్తోంది.. అరుణ కుటుంబ సభ్యులు కూడా మావోయిస్టులుగానే పని చేశారు. ఆమె భర్త, సోదరుడు మావోయిస్టులే. గత ఏడాది జరిగిన ఎన్కౌంటర్ లో అరుణ భర్త, సోదరుడు మృత్యువాత పడ్డారు.
అరుణ కూడా మావోయిస్టు అగ్ర నేతల్లో ఒకరు. గతంలో పాడేరు ఎమ్మెల్యే హత్య ఘటనలో అరుణ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అరుణపై 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా మారేడిమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో అరుణను హతమార్చినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఈ ఎన్కౌంటర్ లో అంజు అనే మరో మావోయిస్టు కూడా మృతి చెందింది. మొత్తానికి బుధవారం రాత్రి 9 గంటల సమయంలో వీరి ముగ్గురి మృతదేహాలు రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాయి.
ఇక్కడ నుంచి పోస్టుమార్టం అనంతరం వారి స్వగ్రామాలకు మృతదేహాలను తీసుకువెళ్లేందుకు బంధువులు ఇప్పటికే రంపచోడవరం ఆసుపత్రికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా అరుణ తండ్రి మాట్లాడుతూ.. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని పేర్కొన్నారు. ఒకవైపు ఉనికి కాపాడుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తుంటే.. మావోయిస్టుల ఎత్తులకు పై ఎత్తు వేస్తూ పోలీసులు ముందుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్
జూన్ 19, 2025 3:09 PM





















