చివరిగా నవీకరించబడింది:
ఆషాడమాసంలో ఆంధ్రప్రదేశ్‌లో అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. గోదావరి జిల్లాల ఆరాధ్య దేవత మరిడమ్మ అమ్మవారి ఉత్సవాలు 40 రోజుల పాటు పెద్దాపురంలో నిర్వహిస్తారు.
ఆషాడమాసం వచ్చిందంటే చాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మవారి ఉత్సవాలు దాదాపు నెలరోజులు అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. నిజానికి ఆషాడం ముందు వివాహం జరిగిన పెళ్లికుమారుడు పెళ్లికుమార్తె సైతం ఆయా ఆలయాలకు చేరుకుని పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అంతే కాదు ఈ ఆషాడ మాసంలో అమ్మవారిని దర్శించడం ద్వారా ఏడాదంతా ఆ కుటుంబం ఎంతో ప్రశాంతంగా ఉంటుందని భక్తుల నమ్మం. అయితే రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొంది లక్షలాదిమంది దర్శించుకునే ఆ అమ్మవారి ఆలయంలో అప్పుడే ఆషాడ మాస ఉత్సవాలకు సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఇంతకీ ఆ అమ్మవారు ఎవరు.. ఆ జిల్లా ఎక్కడుంది.. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
గోదావరి జిల్లాల ఆరాధ్య దేవత.. ప్రజలు కొలిచే చల్లని తల్లి పెద్దాపురం మరిడమ్మ అమ్మవారు. ఆషాడమాసంలో దాదాపు 40 రోజుల పాటు ఇసుక వేస్తే రాలని విధంగా భక్తులు ఇక్కడ మరిడమ్మ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఏడాదిలో మిగిలిన అన్నిరోజులు ఆలయం ఖాళీగా ఉన్న ఆ 40 రోజులు అమ్మవారిని దర్శించాలంటే గంటల గంటల సమయం క్యూలో నుంచోవలసిందే. చాలామంది ఈ బాధలు పడలేక బయట నుంచే అమ్మవారి శిఖరాన్ని దర్శించుకుని సైతం వెను తిరుగుతూ ఉంటారు. అటువంటి మరిడమ్మ అమ్మవారు కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్వయంభువుగా వెలిసినట్లు స్థానికులు చెబుతుంటారు.
ఒక్కమాటలో ఆలయ చరిత్ర చెప్పాలంటే 100 సంవత్సరాల కిందట పెద్దాపురం.. ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో ఎక్కువగా కలరా వ్యాధి వ్యాపించిందంట. ఆ సమయంలో అమ్మవారి దయవల్ల.. అమ్మవారు చెప్పింది చేయడం వలన ఆయా గ్రామాల్లో కలరా వ్యాధి లేకుండా పోయిందంట. అప్పటినుంచి ఈ అమ్మవారిని ఆరాధ్య దేవతగా ఒక్క కాకినాడ జిల్లా ప్రజలే కాకుండా.. గోదావరి జిల్లాల ప్రజలు కొలుస్తున్నారు. ఆషాడ మాసానికి మరింత ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవచ్చు. అమ్మవారికి ఆషాడ మాసంలోని అన్ని రోజులు ఎంతో ఇష్టమైనవి కావడంతో అత్యంత ఘనంగా పెద్దాపురం మరిడమ్మ ఉత్సవాలు దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నారు.
అదేవిధంగా పెళ్లి అయిన వధూవరులు అమ్మవారిని దర్శించడం ద్వారా పండంటి సంతానం కలుగుతుందని నమ్మకం. అందుకే నూతన జంటలు అమ్మవారిని దర్శించుకొని ఆరాధిస్తుంటారు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆషాడ మాసానికి 20 రోజుల ముందే పెద్దాపురం పలువీధుల్లో అమ్మవారి ఉత్సవాలు జాతరగా నిర్వహిస్తారు. అంటే ఒక రోజు ఒక ప్రాంతం, మరొక రోజు మరో ప్రాంతం ఇలా అన్ని ప్రాంతాలు ముగిసిన తర్వాత జాతర ఆలయంలో ప్రారంభమవుతుంది. ఏదేమైనా నిలువెత్తు రూపంలో దర్శనమిచ్చే పెద్దాపురం మరిడమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం ఎమ్మెల్యేలు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. లక్షలాదిగా వచ్చే భక్తజనులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా పర్యవేక్షిస్తామని తెలిపారు. క్యూలైన్లో ప్రత్యేక దృష్టి సారిస్తామని లోకల్ 18కు ప్రత్యేకంగా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్
జూన్ 19, 2025 7:49 PM





















