చివరిగా నవీకరించబడింది:
ప్రభుత్వం రైతులకు రైతు భరోసా డబ్బులు జమ చేస్తోంది. అయితే అన్నదాతల్లో మాత్రం అసహనం కనిపిస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం డబ్బులు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
వానాకాలం సీజన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయడం సోమవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరి ఖాతాల్లోకి ఎకరానికి 6 వేల చొప్పున రైతు భరోసా నిధుల జమ చేసినట్టుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 70,11,984 మంది రైతులకు పెట్టుబడి సాయంగా దాదాపు 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నగదు బదిలీ చేయనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. రైతు భరోసా నిధుల పంపిణీ తొమ్మిది రోజుల్లో పూర్తి చేయనున్నట్టుగా తెలిపింది.
ఈ క్రమంలోనే సోమవారం నుండి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదల చేపట్టగానే పలువురు రైతుల బ్యాంక్ అకౌంట్లలో నిధులు జమ అయ్యాయి. తొలి రోజు 2 ఎకరాలు వరకు భూమి ఉండి సాగుచేస్తున్న రైతులందరి బ్యాంకు ఖాతాల్లోకి ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా డబ్బులు జమ చేసింది. రెండవ రోజు 3, 4 ఎకరాలు ఉన్నవారికి డబ్బులు జమచేసింది.
41.25 లక్షల మంది రైతులకు సంబంధించి 39.16 లక్షల ఎకరాలకు 2,349.83 కోట్లు జమచేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారనే దానితో మిగిలిన అర్హులందరికీ రానున్న 9 రోజుల్లో రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని తెలిపారు. అయితే ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రైతు భరోసా కింద ప్రభుత్వం రెండు, మూడు, నాలుగు ఎకరాలు భూమి ఉన్నవారికి ఆరువేల రూపాయల చొప్పున పంట సాగుకు సహాయం అందిస్తుంది.
ఎన్నికల హామీల భాగంగా 7500 చొప్పున రెండు దశలవారీగా ఇస్తానన్న ప్రభుత్వం 6000 ఇవ్వడం ఏంటని కొంతమంది రైతులు కూడా ప్రశ్నిస్తున్నారు.. 7500 చొప్పున రైతు భరోసా ఇస్తే రైతులకు ప్రభుత్వం ఎంతో సాయం చేసిన వారు అవుతారని రైతులు తెలిపారు.. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రైతు భరోసా ఎన్నికల కోసం ఇచ్చిన అంటూ మరి కొంతమంది రైతులు అంటున్నారు.. ఇది కచ్చితంగా ఎన్నికల స్టంట్ అని మరికొంతమంది రైతులు చెబుతున్నారు.. ఏది ఏమైనప్పటికీ పంట సాగుబడి కోసం రైతు భరోసా ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉందని ఆ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్, కరీంనగర్, తెలంగాణ
జూన్ 18, 2025 5:11 PM
























