హైదరాబాద్ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేకు గ్రీన్ సిగ్నల్

ఏపీ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్రం ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా అమరావతి, హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే డీపీఆర్ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
ఫిబ్రవరి 3న కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ 15 శాఖల అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రతిపాదనలతో పాటు విభజన చట్టం ప్రకారం ఉన్న పెండింగ్ అంశాలపై చర్చించారు.
ఆ సమావేశానికి సంబంధించిన మినిట్స్ ను ఇటీవల ఏపీ, తెలంగాణ సీఎస్ లకు కేంద్ర హోం శాఖ పంపించింది. తాజాగా అమరావతి, హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేకి కేంద్రం పచ్చ జెండా ఊపింది. డీపీఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా శాఖను ఆదేశించింది.
తెలంగాణలో రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ వేగవంతానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
మీడియా ప్రతినిధి – హైదరాబాద్
























