చివరిగా నవీకరించబడింది:
ప్రభుత్వం అదిరే గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. దీని వల్ల ఉచితంగానే బస్‌లో జర్నీ చేయొచ్చు. అయితే ఈ ఫెసిలిటీ అందరికీ ఉండదు. ఈ పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకోండి.
పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు బస్సు పాసులు జారీకి ఆర్టీసీ డిపో అధికారులు చర్యలు చేపట్టారు. పలమనేరు ఆర్టీసీ డిపో పరిధిలోని డిపోలలో ఉన్న బస్సు పాస్ కౌంటర్ వద్ద ఉచిత, రాయితీ బస్సు పాసులు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఇక్కడ కౌంటర్లో దరఖాస్తు ఫారాలు తీసుకుని పూర్తి చేసి, నిర్ణీత పత్రాలు జతచేసి కౌంటర్లోని సిబ్బందికి అందజేసి పాసులు పొందవచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకుని పాసులు తీసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బస్సు పాసులు దరఖాస్తుల ఆధునీకరణ ప్రక్రియ జరుగుతోంది. యథావిధిగా కొత్త పాసులు విద్యార్థులకు జారీ చేస్తున్నారు. ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడి కౌంటర్ వద్ద సిబ్బందిని సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని డిపో మేనేజర్ డి కే స్వామి నాయుడు లోకల్ 18 ద్వారా తెలిపారు. ఆర్టీసీ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వీరికి ఉచితం: ఏడో తరగతి వరకు చదివే 12 ఏళ్లలోపు బాలురు, పదో తరగతి వరకు చదివే 18 ఏళ్ల లోపు బాలికలు మాత్రమే ఉచిత పాసులు తీసుకునేందుకు అర్హులన్నారు. విద్యార్థి ఇంటి నుంచి పాఠశాలకు 20 కిలో మీటర్ల లోపు దూరం ఉంటేనే ఉచిత బస్సు పాసులు జారీ ఉంటుందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలాఖరు వరకు చెల్లుబాటు అవుతాయి. ఈ పాసుల కోసం దరఖాస్తు ఫారంపై పాస్పోర్టు సైజు ఫొటోలు అంటించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకంతో పాటు స్టాంపు వేయించాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తుకు ఒరిజినల్ ప్రస్తుత స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు నకలు జత చేసి స్థానిక ఆర్టీసీ పాసుల కౌంటర్ వద్ద అందజేస్తే పాస్ ఇస్తారన్నారు. దరఖాస్తు చేసే సమయంలో మీ వివరాలు క్షుణంగా పొందుపరచాలన్నారు. అందులో తప్పుగా జతపరిస్తే పాస్ చెల్లుబాటు కాదన్నారు. దరఖాస్తు సమర్పించే సమయంలో రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. ఇవి కూడా కేవలం పాసు నామినేషన్ ఐడీ కార్డు నిమిత్తమే తీసుకుంటారన్నారు.
రాయితీతో చెల్లింపు పాసు: ఒక నెల, మూడు నెలలు, సంవత్సర కాల వ్యవధికి చెల్లుబాటయ్యేలా విద్యార్థులకు 33 శాతం రాయితీతో చెల్లింపు పాసులు (స్టూడెంట్ పెయిడ్ పాసులు) కూడా ఆర్టీసీ జారీ చేస్తుందన్నారు. వీటి కోసం పాఠశాల, కళాశాల విద్యార్థులు ఎవరైనా చదివే పాఠశాల, కళాశాల మధ్య దూరం 50 కిలో మీటర్లు లోపు ఉంటేనే ఈ పాసులు జారీ చేస్తారన్నారు. ఇంటి నుంచి విద్యా సంస్థకు మధ్య ఉన్న దూరం, కాలవ్యవధిని అనుసరించి రాయితీ స్టూడెంట్ పెయిడ్ పాసుల ధర ఉంటుందన్నారు. దరఖాస్తు ఫారంలో పైన ఒక పాస్పోర్టు సైజు ఫొటో, కింద ఉండే బోనఫైడ్ సర్టిఫికెట్ పై ఒక ఫోటో అంటించి వాటిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా కాలేజీ ప్రిన్సిపాల్ సంతకంతో పాటు స్టాంపు వేయించాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తుకు ప్రస్తుతం ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్, పదోతరగతి మార్కుల జాబితా నకలు, ఆధార్ కార్డు నకలు జత చేసి సమర్పించాలన్నారు. మొదటిసారి ఏ కాలపరిమితితో పాసు తీసుకున్నారో తర్వాత రెన్యువల్ పాస్ కూడా అదే కాలపరిమితికి జారీ చేస్తారని తెలిపారు.
విద్యార్థుల సద్వినియోగం: విద్యార్థులు బస్సు పాసులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. డిపోలో ప్రత్యేక కౌంటర్లో పాసులు జారీచేస్తున్నారు. దరఖాస్తులు పూర్తి చేసి అందజేస్తే పాసులు అందిస్తారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టూడెంట్ పాసులు ఇస్తున్నామన్నారు. సెక్యూరిటీ పర్పస్ కోసం పాస్ కార్డు రంగు మార్చారు. గతంలో గోధుమ రంగు, ప్రస్తుతం బ్లూ వైట్ కార్డు జారీ చేస్తున్నారు. వివరాలు కచ్చితంగా ఉన్నచో నిమిషాల వ్యవధిలో పాస్ ఇస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
చిట్టూర్, చిత్తూర్, ఆంధ్రప్రదేశ్
జూన్ 21, 2025 11:45 AM
























