చివరిగా నవీకరించబడింది:
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి భారతదేశ రవాణా రంగ చరిత్రలోనే అత్యంత ఖరీదైన వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Viral: మీ వద్ద డబ్బులు ఎక్కువగా ఉంటే విలాసవంతమైనవి ఏవైనా కొంటారు. ఉదాహరణకు కార్లు.. బంగ్లాలు, నగలు ఇలా లగ్జరీ వస్తువులు కొంటారు. ఇక రూ. 2 కోట్లు అంటే చిన్న అమౌంట్ ఏమీ కాదు. కోట్లకు పడగలెత్తిన వారు కూడా రూ. 2 కోట్లను ఖర్చు చేసే సమయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అయితే ఇప్పుడు సరదా సరదాకి డబ్బును నీళ్లలా ఖర్చు చేసే వారి గురించి చెప్పబోతున్నాను. తెలుసుకున్నాకా.. ఇదేం పిచ్చిరా బాబు అని మీరు అనడం ఖాయం. సాధారణంగా విలాసవంతమైన కారు కొనాలంటే కోట్లు ఖర్చవుతాయి. కానీ, కేవలం ఆ కారుకు తగిలించే ‘నంబర్ ప్లేట్’ కోసం ఒక వ్యక్తి ఏకంగా రెండు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారంటే నమ్ముతారా? అవును, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి భారతదేశ రవాణా రంగ చరిత్రలోనే అత్యంత ఖరీదైన వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన కిరణ్ కొల్పకుల అనే వ్యక్తి ఈ అరుదైన రికార్డును నెలకొల్పారు. లగ్జరీ కార్ల డీలర్‌షిప్ సంస్థ ‘బిగ్ బాయ్ టాయ్జ్’ (Big Boy Toyz) నిర్వహించిన ఒక ప్రత్యేక వేలంలో ఆయన పాల్గొన్నారు. ఈ వేలంలో ‘DDC 0001’ అనే పాత (Vintage) VIP నంబర్ ప్లేట్ కోసం కిరణ్ ఏకంగా రూ. 2.08 కోట్లు వెచ్చించి దానిని దక్కించుకున్నారు.
భారత మార్కెట్లో లభించే అనేక సూపర్ కార్ల ధర కంటే ఈ నంబర్ ప్లేట్ ధర ఎక్కువగా ఉండటం గమనార్హం. కేవలం నంబర్ ప్లేట్ కోసమే ఇంత భారీ మొత్తం వెచ్చించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదివరకు హర్యానాకు చెందిన ఒక వ్యక్తి ‘HR 88 B 8888’ అనే నంబర్ కోసం రూ. 1.17 కోట్లు వేలం పాడారు, కానీ ఆ తర్వాత ఆయన పేమెంట్ చేయకపోవడంతో ఆ రికార్డు అధికారికంగా నిలవలేదు. అయితే, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వ్యక్తి వేలం పాడిన రూ. 2.08 కోట్లు ఇప్పటివరకు భారతదేశంలో ఒక వాహన నంబర్ ప్లేట్ కోసం వెచ్చించిన అత్యధిక మొత్తంగా నమోదైంది.
బిగ్ బాయ్ టాయ్జ్ వ్యవస్థాపకుడు జతిన్ అహూజా ఈ వేలం గురించి మాట్లాడుతూ.. అరుదైన మరియు వింటేజ్ నంబర్ ప్లేట్లకు కలెక్టర్ల మధ్య విపరీతమైన పోటీ ఉంటుందని తెలిపారు. ‘0001’ వంటి నంబర్లు హోదాకు చిహ్నంగా భావిస్తారు. ముఖ్యంగా పాత సిరీస్‌కు చెందిన నంబర్లను వేలం వేసినప్పుడు పారదర్శకత, ధృవీకరణ ఉన్న ప్లాట్‌ఫారమ్‌ల కోసం కొనుగోలుదారులు ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధపడతారని ఈ ఉదంతం నిరూపించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్సీ నంబర్ల పట్ల ఉన్న క్రేజ్ కొత్తదేమీ కాదు. గతంలోనూ రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు వెచ్చించి నంబర్లు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఏకంగా రూ. 2 కోట్లు దాటిపోవడం చూస్తుంటే విలాసాల విషయంలో భారతీయులు ఏమాత్రం తగ్గడం లేదని అర్థమవుతోంది. కిరణ్ కొల్పకుల దక్కించుకున్న ఈ ‘DDC 0001’ నంబర్ ప్లేట్ ఇప్పుడు దేశంలోనే అత్యంత ఖరీదైన ‘సిగ్నేచర్’ నంబర్‌గా నిలిచిపోయింది.
హైదరాబాద్, తెలంగాణ

























