చివరిగా నవీకరించబడింది:
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని వామపక్ష నాయకులు యోగాసనాలతో నిరసన తెలిపారు. 21న మోడీ రాక సందర్భంగా ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద యోగాసనాలు వేస్తూ వామపక్ష నాయకులు వినూత్న నిరసన చేశారు. స్టీల్ ప్లాంట్ అమ్మడానికి కావాల్సిన అన్ని కుట్రలు కేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నది అని లోకల్ 18 తో విశాఖ సిఐటియు నాయకులు కుమార్ తెలిపారు. 2021లో ప్లాంటును 100శాతం అమ్ముతామని కేంద్రం ప్రకటించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని నిరసనలు చేసిన ఇంతవరకు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదన్నారు. ప్రధాని మోడీ ఈనెల 21న విశాఖ వస్తున్నారు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేస్తున్నట్లు ప్రధాని ప్రకటించాలని విశాఖలో వినూత్నంగా యోగా చేస్తూ నిరసన చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానితో ఈ ప్రకటన చేయించాలని విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
రూ.11440 కోట్ల ప్యాకేజీ సాధించాం, స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారమై పోయిందంటూ కూటమి నేతలు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఈ ప్యాకేజీ నిధుల్లో రూ.500 కోట్లు జిఎసిటి పేరున, రూ.9300 కోట్లు బ్యాంకు అప్పుల పేరున తిరిగి లాగేసుకున్నారన్నారు. మిగిలిన సొమ్ము వారు చెప్పినట్లు వేలాది కార్మికులను తొలగిస్తేనే ఇస్తారు. ఈ నిధుల్లో నుంచి ముడిసరుకు గానీ, యంత్రాలకు గానీ, కార్మికుల జీతాభత్యాలకు గానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయరాదని ప్యాకేజీలో ఆంక్షలు పెట్టారు. ఈ విషయాలు బయటకు రాకుండా దాచిపెట్టారు. ఇది ప్రజలను మోసగించడం కాదా అని ప్రశ్నించారు.
ఇప్పుడు ఉద్యోగులు 10400 మంది, కాంట్రాక్ట్ కార్మికులు 13900 మంది మాత్రమే ఉన్నారు. వీరు కూడా ఎక్కువ అయిపోయారంటూ 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను చట్టవిరుద్ధంగా, అన్యాయంగా కేంద్ర ఆదేశాలతో యాజమాన్యం తొలగించిందన్నారట. అర్ధాంతరంగా వీరిని వీధిన పడేస్తే వీరి భార్య, బిడ్డలు, కుటుంబాలు ఏం కావాలి అని ప్రశ్నించారు. ఈ అన్యాయాన్ని ఆపవలసిన టిడిపి, జనసేన, బిజెపి కూటమి నేతలు మోడీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారు అన్నారు. ఇది వీరిని నమ్మి ఓట్లు వేసి గెలిపించిన వారిని వంచించడం కాదా అని ప్రశ్నించారు.
2021 నుండి స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం విశాఖ ఉక్కు కార్మికులు 4 సంవత్సరాలుగా కూర్మన్నపాలెం జంక్షన్లో నిరాహార దీక్షా శిబిరాన్ని నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘం నేతలు ఈ దీక్షల్లో పాల్గొంటున్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా పోలీసులను ప్లాంట్లోని డిపార్ట్‌మెంట్లలో కార్మికులు పనిచేస్తున్న ప్రదేశాలలోకి పంపించి కార్మికులను, నాయకులను బెదిరించించి అరెస్టులు చేసి, కేసులు పెడుతున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
విశాఖపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
జూన్ 20, 2025 4:26 PM
























