చివరిగా నవీకరించబడింది:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనను సిద్ధం చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్ష సమావేశంలో ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా బేసిన్‌కు మళ్లించేందుకు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. నదుల అనుసంధానంలో భాగంగా దాదాపు రూ. 80 వేల కోట్ల రూపాయలతో గోదావరి బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనను సిద్ధం చేసింది.
గోదావరి నుంచి సగటున ప్రతి సంవత్సరం 2 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఈ 2 వేల టీఎంసీల నీళ్ల వృధాలో 200 టీఎంసీల నీటిని వరదల సమయంలో మళ్లించాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాదన. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ వాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గోదావరి జల వివాదం ట్రైబ్యునల్ అవార్డుకు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి ఈ ప్రాజెక్టు పూర్తిగా వ్యతిరేకమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది.
ఈ ప్రాజెక్టు నిర్మించే విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా చూడాలని కేంద్రాన్ని కోరుతోంది. మరోవైపు సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి వరద నీళ్లను బనకచర్లకు తరలిస్తే తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమిటని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం గోదావరికి వరద వచ్చే రోజుల్లోనే నీళ్లు తరలించనుండటంతో గోదావరి డెల్టాకు పరివాహక ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అన్ని పార్టీలకు చెందిన ఎంపీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏపీ ప్రభుత్వం నిర్మించే గోదావరి బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని చర్చించారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి కేంద్రంలోని బీజేపీతో సత్సంబంధాలు ఉండడంతో ఈ ప్రాజెక్టు అనుమతులు పొంది ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టే అవకాశం ఉన్నందున దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే ఒకవేళ సత్సంబంధాల కారణంగా ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు పొందితే తమ రాష్ట్రానికి గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు మొత్తం 1500 టీఎంసీలు వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఎన్ఓసి ఇచ్చి ముందుకు వెళ్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
కర్నూల్, ఆంధ్రప్రదేశ్
జూన్ 20, 2025 10:32 ఆన్
























