చివరిగా నవీకరించబడింది:
పోచారం వన్యప్రాణుల అభయారణ్యం ప్రకృతితో మమేకమయ్యే వారికి అద్భుత ప్రదేశం. 5600 ఎకరాల్లో విస్తరించి, 600కి పైగా జింకలు, నెమళ్లు, దుప్పులు నివసిస్తాయి. వన విజ్ఞాన కేంద్రం సందర్శకులకు అవగాహన కల్పిస్తుంది.
తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలోని పోచారం వన్యప్రాణుల అభయారణ్యం ప్రకృతితో మమేకమయ్యే వారికి.. జంతు ప్రేమికులకూ, విద్యార్థులకూ ఒక అద్భుతమైన ప్రదేశంగా మారింది. దాదాపు 5600 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ అభయారణ్యంలో 600కి పైగా జింకలు సహా నెమళ్లు, దుప్పులు, మనుబోతులు, అడవి పందులు తదితర వన్యప్రాణులు నివసిస్తున్నాయి.
అభయారణ్యంలో ఏర్పాటు చేసిన వన విజ్ఞాన కేంద్రం సందర్శకులకు కొత్త అనుభూతులు కలిగించడమే కాకుండా వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పిస్తుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సఫారీ వాహనంలో ప్రయాణించడం ద్వారా సందర్శకులు జంతువులను దగ్గరగా వీక్షించవచ్చు. పెద్దలకు రూ.100, చిన్న పిల్లలకు రూ.50 చొప్పున రుసుం తీసుకుంటున్నారు.. వీరితో పాటు గైడ్ సహాయంతో సఫారీ చేస్తుంటారు. విద్యార్థుల కోసం వన్యప్రాణుల మోడల్స్, ఫొటోలు, టీవీ ప్రదర్శనల ద్వారా విద్యాపరమైన సమాచారాన్ని అందిస్తున్నారు.
పర్యాటకుల సౌకర్యార్థం గెస్ట్ హౌస్, పచ్చని పార్క్, కుర్చీలు, వ్యూ పాయింట్ లాంటివి అందుబాటులో ఉన్నాయి. వాచ్ టవర్ నుంచి చూడగలిగే పచ్చటి అడవులు చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి. వేసవి కాలంలో జంతువుల ఆహారంగా గడ్డి నిల్వలు, నీటి ట్యాంకులు, సోలార్ మోటార్లు ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. మెదక్ పట్టణానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అభయారణ్యం సెలవు రోజుల్లో కుటుంబ సమేతంగా ప్రకృతిని ఆస్వాదించేందుకు సరైన ప్రదేశంగా నిలుస్తోంది.
హైదరాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తున్నారు. వన విజ్ఞాన కేంద్రం పక్కన గెస్ట్ హౌస్, పార్క్, విశ్రాంతికై కుర్చీలు వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. పోచారం అభయారణ్యం పర్యాటకులకు విజ్ఞానంతో పాటు ప్రశాంతతను చేకూరుస్తుంది.
తెలంగాణలోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు తెలంగాణ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
మెదక్, తెలంగాణ
జూన్ 19, 2025 4:11 PM
























