చివరిగా నవీకరించబడింది:
Madhapur Suicide Case: మాదాపూర్ దుర్గం చెరువు ఎప్పుడూ.. జనాలతో రద్దీగా ఉంటుంది. అలాంటి చోట ఓ యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది.
హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దుర్గం చెరువులో యువతి మృతదేహం కలకలం రేపింది. సికింద్రాబాద్ అడ్డగుట్టలో ఉంటున్న 27 ఏళ్ల సుష్మ, నిన్న హైటెక్ సిటీలోని డీబోల్డ్ ఆఫీసుకి పని నిమిత్తం వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తండ్రి అంజయ్య ఆందోళన చెందారు. రాత్రి 10:30 గంటలకు సుష్మ కార్యాలయం నుంచి బయలుదేరినట్లు అంజయ్యకు, ఆఫీస్ మేనేజర్ తెలిపారు. అయినప్పటికీ ఆమె ఇంటికి రాలేదు.
ఆమె కనిపించకపోవడంతో అంజయ్య ఉదయం 4 గంటల సమయంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ క్రమంలో ఉదయం 7 గంటల సమయంలో దుర్గం చెరువులో ఒక మహిళ మృతదేహం తేలుతున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పరిశీలించి అది సుష్మదిగా గుర్తించారు. పోలీసులు ఈ ఘటనను ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ, మరణానికి గల కచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరణ కారణాలు స్పష్టమవుతాయని పోలీసులు భావిస్తున్నారు. సుష్మ మరణానికి ఎలాంటి అనుమానాస్పద అంశాలు ఉన్నాయి అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. సుష్మ ఆఫీస్ నుంచి బయలుదేరిన తర్వాత ఏం జరిగింది, ఆమె చెరువులోకి ఎలా చేరుకుంది అనే విషయాలపై పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరిస్తున్నారు.
స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపింది. సుష్మ కుటుంబం ఈ ఆకస్మిక మరణంతో శోకంలో మునిగిపోయింది. ఆమె మరణం ఆత్మహత్యా లేక ఇతర కారణాల వల్ల సంభవించిందా అనేది పోలీసుల దర్యాప్తు ఆధారంగా తేలనుంది. ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సినంత దుస్థితి లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అందువల్ల ప్రస్తుతం, మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణలోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు తెలంగాణ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
హైదరాబాద్, తెలంగాణ
జూన్ 19, 2025 10:09 ఆన్

























