చివరిగా నవీకరించబడింది:
శ్రీశైలం మహాక్షేత్రంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. 1500 మందికి పైగా పాల్గొనగా, విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, సర్టిఫికెట్లు అందించారు.
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. శ్రీశైలం మహాక్షేత్రంలో ఏరువాక సంబరాల్లా యోగా ఉత్సవం సాగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు నంద్యాల జిల్లాలో ఐదు ప్రముఖ ప్రదేశాల్లో యోగా శిబిరాలు నిర్వహించగా, వాటిలో శ్రీశైలం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
శ్రీశైలం దేవస్థానంలో ఈవో శ్రీ ముత్యాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చంద్రావతి కళ్యాణ మండపం వద్ద నిర్వహించిన ఈ యోగేంద్ర కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. తొలిసారిగా మహాక్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1500 మందికి పైగా పాఠశాలల విద్యార్థులు, అధికారులు, దేవస్థాన సిబ్బంది, స్థానికులు, సేవాకర్తలు పాల్గొన్నారు. ప్రాతఃకాలంలో వేదఘోషల మధ్య ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి విభిన్న యోగా చర్యలతో సాగింది.
కేవలం శ్రీశైలం మాత్రమే కాదు, మహానంది, అహోబిలం, బెలూం గుహలు, పెచ్చెర్ల వంటి వైష్ణవ మరియు శైవ క్షేత్రాల్లోనూ యోగా దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎస్. రాజకుమారి తలపెట్టిన ఈ వినూత్న కార్యక్రమాలకు ప్రజలు విశేషంగా స్పందించారు.
ఈ సందర్భంగా దేవస్థాన ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. యోగం అనేది మన సంప్రదాయపు ప్రాణం. మన శారీరక, మానసిక ఆరోగ్యానికి అత్యంత కీలకమైన సాధనం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా ఇలాంటి ఆరోగ్యపరమైన కార్యక్రమాలు జరగడం ఎంతో గర్వకారణం అని తెలిపారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా భాగంగా యోగా అధ్యాపకులు పలు ఆసనాల ప్రదర్శన చేశారు. విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, సర్టిఫికెట్లు అందించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా యోగా సంప్రదాయాన్ని గ్రామీణ, పట్టణ స్థాయిలో ప్రజలకు చేరువ చేసే పనిలో శ్రీశైలం ముందుండటంతో మహాక్షేత్రానికి మరో కొత్త గుర్తింపు లభించింది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Nandyal,Kurnool,Andhra Pradesh
జూన్ 21, 2025 3:46 PM





















