గత ఏడాది కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం (AP Government). ప్రస్తుతం జిల్లా కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో పల్నాడు జిల్లా (Palanadu District) కేంద్రమైన నరసరావు పేట (Narasaraopeta) పట్టణం సుందరీకరణకు సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి పేర్కొన్నారు. నగరోదయం పేరుతో పట్టణాలను అందంగా తీర్చి దిద్దేందుకు గాను ఎస్,ఆర్.శంకరన్ హాల్ నందు జిల్లా వ్యాప్తం గా అన్నినియోజక వర్గాల పరిధిలో అర్బన్ మున్సిపాలటీల లో ప్రహరీ గోడలకు అందమైన పెయింటింగ్స్ వేయించే కార్యక్రమంపై ఆయా మున్సిపల్ కమీషనర్లు, సచివాలయ ఉద్యోగులతో బ్యూటికేషన్ ఆఫ్ అర్బన్ సిటీస్ పై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
నరసరావు పేట పట్టణం, వినుకొండ, సత్తెనపల్లి తదితర మున్సిపాలిటి పర్దిలోని పట్టణాల్లో నగర సుందరీకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రధాన రహదారులు, అంతర్గత ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల వెంట ఉన్న ప్రహరీ గోడలకు అందమైన రంగులను వేసి అత్యంత రమణీయంగా,ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఇందు కోసం ప్రణాళిక బద్దంగా రహదారుల వెంట ఉన్న ప్రభుత్వ గోడలు, ప్రైవేటు గోడలు గుర్తించడం, వాటి పొడవు, వెడల్పు, వైశాల్యం వివరాలను వెంటనే సేకరించి నివేదికను తయారు చేయ్యాలని ఆదేశించారు.
అదే తరహాలో అనుభవం, నైపుణ్యం కలిగిన ఆర్టిస్టుల ద్వారా ప్రహరీ గోడలకు అందమైన ఆకృతులతో బొమ్మలు వేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం వారిని ఆహ్వానించి 500 అడుగులు వరకు పెయింటింగ్ వేసేందుకు సహకారం తీసుకోవాలని ఆదేశించారు. అందంగా రంగులతో ఆకర్షణీయంగా తీర్చి దిద్దిన వారికి ప్రధమ బహుమతి గా రూ.50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.30 వేలు, తృతీయ బహుమతిగా రూ.20 వేలు పారితోషకం అందించటం జరుగుతుంది.
చిన్నారులు, పెద్దలు, కళాకారులు వంటి 3 కేటగిరీల్లో గోడలకు అందమైన రంగులు వేసిన వారికి బహుమతులు, ప్రశంసాపత్రం అందించటం జరుగుతుంది. ఆసక్తి గల వారు వివరాలను 7680905745 కు నెంబరు నమోదు చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు, సచివాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
నారసరాప్తెట్, గుంతూర్, ఆంధ్రప్రదేశ్
మే 13, 2023 11:08 AM
























