చివరిగా నవీకరించబడింది:
నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్లి ఐదుగురు యువకులు మృతి చెందడంతో భక్తుల రక్షణపై యంత్రాంగం దృష్టి సారించింది. పోలీసు శాఖ మాక్ డ్రిల్ నిర్వహించి భద్రతా చర్యలు చేపట్టింది.
నదీ స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. అందుకే ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లినా ముందుగా అక్కడ ప్రవహించే పుణ్య నదిలో స్నానాలు చేసిన తర్వాతే భక్తులు దైవ దర్శనం చేసుకుంటారు. ఇదే ఆనవాయితీ అంతటా కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ నదీ తీర ప్రాంతంలో కొలువై ఉన్న పుణ్య క్షేత్రాలకు వచ్చే భక్తులు కూడా నదీ స్నానం ఆచరించిన తర్వాతే దైవదర్శనం చేసుకుంటారు. చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి కొలువున్న బాసరలో ప్రవహిస్తున్న గోదావరి నదిలో ముందుగా భక్తులు పుణ్య స్నానాలు చేసిన తర్వాతే అమ్మవారి దర్శనం కోసం ఆలయంలో బారులు తీరతారు.
అటు మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం గూడెంలో కొలువున్న శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కూడా సమీపంలోని గోదావరి నదిలో స్నానాలు చేసి వచ్చి స్వామి వారిని దర్శించుకొని మొక్కు తీర్చుకొని వెళుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రమాదబారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి నదిలో స్నానాలు చేసేందుకు వెళ్లి ఐదుగురు యువకులు మృతి చెందారు. దీంతో గోదావరి నదిలో భక్తుల రక్షణపై యంత్రాంగం దృష్టి సారించింది. ఇందులో పోలీసు శాఖ ఒకడుగు ముందుకు వేసి విపత్కర పరిస్థితులు నెలకొన్న సమయంలో ఎదుర్కొనేందుకు వీలుగా ముందస్తు చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నదిలో మాక్ డ్రిల్ నిర్వహించారు. రెండు గంటలపాటు కొనసాగిన ఈ మాక్ డ్రిల్‌లో మహిళా శివంగి పోలీసులు, డీడీఆర్ఎఫ్ పోలీసులతో కలిసి ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. జిల్లా ఎస్.పి జానకి షర్మిల, అదనపు ఎస్.పి అవినాష్ కుమార్ కూడా పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈ సందర్భంగా పోలీసులకు అవగాహన కల్పించారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, వరద నీటిలో కొట్టుకుపోతున్న సమయంలో ప్రాణాలను ఎలా కాపాడాలో సిబ్బందికి అవగాహన కల్పించారు.
రానున్న రోజుల్లో కురిసే వర్షాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం జిల్లాలోని ఒక్కో పోలీసు స్టేషన్ నుండి ముగ్గురు చొప్పున మొత్తం 82 మందిని ఎంపిక చేసి, వారికి జిల్లా కేంద్రంలోని బంగల్ పేట్ చెరువులో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు జిల్లా ఎస్. పి జానకి షర్మిల తెలిపారు. శిక్షణ పొందిన ఈ బృందంతో కలిసి నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి నదిలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఏది ఏమైనప్పటికీ నిత్యం బాసర అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులతో కిటకిటలాడే గోదావరి తీరంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టి వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తెలంగాణలోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు తెలంగాణ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Adilabad,Telangana
జూన్ 20, 2025 2:35 PM






















