చివరిగా నవీకరించబడింది:
ఆదిలాబాద్ జిల్లా ఎస్.పి అఖిల్ మహజన్ ఆధ్వర్యంలో పోలీసు డాగ్ స్క్వాడ్ కోసం ప్రత్యేకంగా ఈత కొలనును నిర్మించారు. ఇది రాష్ట్రంలోనే తొలి స్విమ్మింగ్ పూల్.
విశ్వాసం గల జంతువులు అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది శునకాలు. విశ్వాసమే కాదు ఆ శునకాలకు పసిగట్టే లక్షణం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే పోలీసులు నేర పరిశోధనలో ఈ శునకాలను కూడా తీసుకువెళుతుంటారు. పోలీసు శాఖలో ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్ కూడా ఉంటుంది. వీటినే పోలీసు జాగిలాలు అని కూడా పిలుస్తారు. అయితే ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖకు సంబంధించిన డాగ్ స్క్వాడ్ లో పనిచేస్తున్న శునకాల కోసం రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఈత కొలనును నిర్మించారు. నేర పరిశోధనలో పోలీసులకు చేదోడువాదోడుగా ఉండే ఈ జాగిలాలకు వ్యాయామంతోపాటు ఉత్సాహం కోసం ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ ఈత కొలనును జిల్లా ఎస్.పి అఖిల్ మహాజన్ ప్రారంభించారు.
ఆదిలాబాద్ జిల్లా పోలీసు డాగ్ స్క్వాడ్ లో ఎనిమిది జాగిలాలు ఉన్నాయి. బాంబులు, ఇతర పేలుడు పదార్థాలను కనుగొనడంలో కీలక పాత్రను పోషిస్తూ పోలీసు శాఖకు సేవలను అందిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలో ప్రముఖల పర్యటనల సందర్భంగా కూడా వీటి సేవలను వినియోగిస్తున్నారు. అయితే ఈ ఎనిమిది జాగిలాల్లో ఐదు జాగిలాలు పేలుడు పదార్థాలను కనుగొనేలా, రెండు జాగిలాలు నేరస్థులను పట్టుకునే విధంగా శిక్షణ పొందాయి. మరొక జాగిలం మాదక ద్రవ్యాలను గుర్తిస్తుంది.
ఇలా పోలీసు శాఖ చేదోడువాదోడుగా నిలుస్తున్న జాగిలాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆదిలాబాద్ జిల్లా ఎస్.పి. అఖిల్ మహజన్ వీటి కోసం ప్రత్యేకంగా జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో ప్రత్యేకంగా ఈత కొలనును ఏర్పాటు చేయించారు. ఇది రాష్ట్రంలోని పోలీసు జాగిలాల కోసం ఏర్పాటు చేసిన తొలి ఈత కొలను. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వీటి ఆరోగ్యం కోసం ఈ ఈత కొలనును ఏర్పాటు చేశారు.
జాగిలాలకు వేసవిలో ఉపశమనం కల్పించడమే కాకుండా వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు ఈ ఈత కొలను ఉపయోగపడుతుందని డాగ్ స్క్వాడ్ సిబ్బంది చెబుతున్నారు. వీటికి ఈతలోనూ ప్రత్యేకంగా శిక్షణనిచ్చినట్లు తెలిపారు. జిల్లా ఎస్.పి ప్రత్యేక చొరవ తీసుకొని తక్కువ సమయంలోనే వీటి కోసం ప్రత్యేకంగా ఈత కొలను ఏర్పాటు చేయించారని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శునకాల కోసం ప్రత్యేకంగా ఈత కొలను ఏర్పాటు చేయడం విశేషమైతే, ఇది రాష్ట్రంలోనే తొలి స్విమ్మింగ్ పూల్ కావడం మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు.
తెలంగాణలోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు తెలంగాణ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Adilabad,Telangana
జూన్ 19, 2025 11:25 ఆన్
























