చివరిగా నవీకరించబడింది:
Cow Protection Policy: సీఎం రేవంత్ రెడ్డి.. క్రమంగా అన్‌ప్రెడిక్టబుల్ అవుతున్నారు. అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. సాధారణంగా గోవుల్ని కాపాడేది తామే అని చెప్పుకుంటున్న బీజేపీకి చెక్ పెట్టాలి అన్నట్లుగా ఆయన గోవుల సంరక్షణకు కీలక నిర్ణయం తీసుకున్నారు. దాని ఇందులో మరో కోణం కూడా ఉంది. అదేంటో చూద్దాం.
రాజకీయాలు ఎప్పుడు ఏం అంశంతో కాక రేపుతాయో చెప్పలేం. అందుకే నేతలు ఎప్పుడూ అలర్టుగా ఉంటారు. వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వారు వేసే వ్యూహాలు, ఎత్తుగడలను అంత ఈజీగా పట్టుకోలేం. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైన తెలివితేటలు ఉన్నాయి. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు.. డైరెక్టుగా తీసేసుకుంటారు. దాంతో.. అది రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా ఆయన.. తెలంగాణలో గోవుల సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు.. రాష్ట్రంలో గోవుల సంరక్షణకు సంబంధించిన విధానాలను అధ్యయనం చేయడానికి ముగ్గురు అధికారులతో ఉన్నతస్థాయి కమిటీని కూడా నియమించారు.
కమిటీ ఏం చేస్తుంది?:
ఈ కమిటీ వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న గో సంరక్షణ విధానాలను పరిశీలించి, తెలంగాణకు అనువైన సమగ్ర ప్రణాళికను తయారుచేస్తుంది. ఈ విధానం రాష్ట్రంలో గోవుల రక్షణ, సంరక్షణకు కొత్త దిశానిర్దేశం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు, భక్తుల మనోభావాలను గౌరవించే లక్ష్యంతో తీసుకున్నది.
మొదటి దశలో, రాష్ట్రంలోని 4 ప్రాంతాల్లో అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలను నిర్మించాలని సీఎం ఆదేశించారు. ఈ గోశాలలను.. గోవులకు పూర్తి సంరక్షణను అందించడమే కాకుండా, మోడ్రన్ టెక్నాలజీని ఉపయోగించి గోవుల ఉత్పత్తులను ప్రోత్సహించే విధంగా రూపొందిస్తారు. వేములవాడలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఒక ఆధునిక గోశాల నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఈ గోశాలలో కోడె మొక్కుగా దానం చేసే గోవులకు ప్రత్యేక రక్షణ ఉంటుంది. ఈ చర్యలతో రాష్ట్రంలో గోవుల సంరక్షణకు కొత్త ఊపిరి లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
రాష్ట్రంలో గోవుల సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాల అధ్యయనానికి ముగ్గురు అధికారులతో ముఖ్యమంత్రి గారు ఉన్నతస్థాయి కమిటీని నియమించారు.
✅పశు సంవర్ధక… pic.twitter.com/fbl4tjvvuk
– తెలంగాణ CMO (@Telanganacmo) జూన్ 17, 2025
ఈమధ్య రాజన్న ఆలయంలో కోడెల మరణాలు బాగా పెరిగాయి. దాదాపు 26 గోవులు చనిపోయాయి. దీనిపై మాజీ మంత్రి హరీశ్ రావు భగ్గుమన్నారు. అది కాస్తా రాజకీయంగా కలకలం రేపింది. అసలే తెలంగాణ బీజేపీ, బీఆర్ఎస్ విలీనం అవుతాయనే ఒక ప్రచారం కొన్నాళ్లుగా సాగుతోంది. జనరల్‌గా గోవుల అంశాన్ని బీజేపీ తరచూ ఎత్తుతూ ఉంటుంది. ఇప్పుడూ ఈ రెండు పార్టీలూ.. గోవుల అంశాలపై ఫోకస్ పెడుతుంటే.. కాంగ్రెస్ కూడా అలర్ట్ అయ్యింది. గోవులకు అసలైన రక్షణ తామే ఇస్తున్నాం అనే సంకేతాలు వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి తాజా ఆదేశాలు ఉన్నాయి.
గోవులు భారతీయ సంస్కృతిలో పవిత్రమైన స్థానాన్ని కలిగి ఉన్నాయనీ, వాటి రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విధానం ద్వారా గో సంరక్షణతో పాటు, గో ఆధారిత ఉత్పత్తుల ఉత్పత్తి, అమ్మకాలను ప్రోత్సహించి, గ్రామాలను బలంగా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా గో సంరక్షణకు సంబంధించిన మరిన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. సీఎం నిర్ణయంపై.. రాష్ట్రంలోని రైతులు, గో భక్తులు, సాంప్రదాయవాదుల నుంచి సానుకూల స్పందన వస్తోంది.
హైదరాబాద్, తెలంగాణ
జూన్ 18, 2025 11:17 AM






















