చివరిగా నవీకరించబడింది:
మామునూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. 949 ఎకరాల అవసరంలో 696 ఎకరాలు ఉన్నాయి. రైతులు ఎకరాకు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. భూ సేకరణలో ఆలస్యం జరుగుతోంది.
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టును పునరుద్ధరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. విమానాశ్రయం ఏర్పాటుకు మొత్తం 949 ఎకరాల స్థలం అవసరం కాగా ప్రస్తుతం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో 696 ఎకరాల పైచిలుకు స్థలం ఉంది. మరో 253 ఎకరాల స్థలం సేకరించాల్సి ఉంది. అయితే ఇటీవలే అధికారులు మాత్రం రైతుల వద్ద నుంచి స్థలాన్ని సేకరించేందుకు సిద్ధమయ్యారు.
వరంగల్ జిల్లాలోని నక్కలపల్లి, గుంటూరుపల్లి, గాడిపల్లి శివారులో సర్వే చేసిన అధికారులు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఇటు అధికారులు సైతం రైతులతో సమావేశం నిర్వహించారు. అయితే ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.1.20 కోట్లు, లేఅవుట్ ఫ్లాట్లకు చదరపు గజానికి రూ.4,887 చొప్పున చెల్లిస్తామంటూ అధికారులు ప్రతిపాదించారు. ఇందుకు భూములు కోల్పోతున్న రైతులు ఈ ధరను అంగీకరించలేదు. మరోసారి సమావేశం అవుదామని చెప్పి అధికారులు వాయిదా వేశారు. భూ సేకరణపై నాలుగు నెలలుగా ఇదే వైఖరి కొనసాగుతోంది.
మామునూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ ప్రక్రియ ఎంతకీ ముందుకు సాగడం లేదని చెప్పవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మంత్రి కొండా సురేఖ ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించినా ఎయిర్‌పోర్టు అభివృద్ధిలో ఎలాంటి మార్పు ఉండటం లేదు. భూములు కోల్పోతున్న వారికి నష్టపరిహారం నిర్ణయించడంలో ఆలస్యం జరుగుతోంది.
ప్రభుత్వం నిర్ణయించిన ధరను తాము అంగీకరించడం లేదని తమకు ఎకరానికి రూ.2 కోట్లు కేటాయించాలని గుంటూరుపల్లి గ్రామానికి చెందిన కొంగర భాస్కర రావు అనే రైతు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమకు ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో ఎకరం భూమి ఎయిర్‌పోర్టుకు వెళ్తుందని తెలిపారు. అభివృద్ధికి తాము అడ్డు కాదని మార్కెట్ వాల్యూ ప్రకారం తమకు ధర కల్పిస్తే భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమకు ఎకరాకు రెండు కోట్ల రూపాయలతో పాటు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలన్నారు.
తమ తాతల, ముత్తాతల నుంచి వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నామని ఉప్పలయ్య అనే రైతు తెలిపారు. తమకు ఉన్నటువంటి మూడున్నర ఎకరాల భూమి ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వెళ్తుందన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం తమకు రూ.1.20 కోట్లు కేటాయిస్తామని చెబుతుందని అందుకు తాము అంగీకరించడం లేదన్నారు. తమకు ఎకరాకు రూ.2 కోట్లు ఇస్తేనే భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు.
తమ ప్రాంతంలో ఎకరాకు రూ.3 కోట్ల పైనే ధర పలుకుతుందని శ్రీనివాసరావు అనే రైతు తెలిపారు. తనకు ఉన్నటువంటి 10 ఎకరాల భూమి ఎయిర్‌పోర్టులో కలుస్తుందన్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.1.20 కోట్లు ఇస్తాం అనడం సరికాదన్నారు. కనీసం 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ కేవలం ఒక మౌలిక సదుపాయ ప్రాజెక్ట్ కావొచ్చు. కానీ రైతుల హక్కుల్ని కాపాడాల్సిన అవసరం కూడా ఉంది. అభివృద్ధి ప్రయోజనాలకు భూములు ఇచ్చే రైతులకు గౌరవవంతమైన నష్టపరిహారం లభించే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలి.
వరంగల్, తెలంగాణ
జూన్ 18, 2025 10:27 ఆన్
























