చివరిగా నవీకరించబడింది:
మెదక్ జిల్లా కొత్తపేట గ్రామ శివారులో ఉన్న ఉమా సంగమేశ్వర దేవస్థానం ఐదు శతాబ్దాల చరిత్ర కలిగి ప్రసిద్ధి. ప్రతి శ్రావణ మాసంలో నీటి ప్రవాహం గుడిలోకి ప్రవేశిస్తుంది.
తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా, పెద్ద శంకరంపేట మండలం కొత్తపేట గ్రామ శివారులో వెలసిన ఉమా సంగమేశ్వర దేవస్థానం ఒక అతి ప్రాచీన పవిత్ర క్షేత్రం. ఐదు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో ఉన్న శివలింగం స్వయంభువుగా వెలిసినదిగా భక్తుల నమ్మకం. ఈ శివలింగానికి ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఏదో ఒక సమయానికి ఒకేసారి నీటి ప్రవాహం గుడిలోకి ప్రవేశించి సరిగ్గా పది నిమిషాల పాటు నిలిచి, అనంతరం మళ్లీ వెనక్కి వెళ్లిపోతుందని చెప్పబడుతుంది. ఇది పూర్వకాలం నుంచే భక్తుల ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వస్తోంది. ఆలయ పూజారుల మాటల ప్రకారం, ఈ దృశ్యం ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ ప్రతి శ్రావణ మాసంలో ఇది చోటుచేసుకుంటుందని భక్తుల విశ్వాసం.
ఈ దేవస్థానానికి “సంగమేశ్వర” అనే పేరుతో పాటు, ఇక్కడ వెలసిన ఉమాదేవి వలన “ఉమా సంగమేశ్వర దేవాలయం” అనే పేరూ స్థిరమైంది. ఒకానొక కాలంలో ఈ దేవాలయం “కొప్పోల్ సంగమేశ్వర దేవాలయం”గా ప్రసిద్ధి చెందింది. కానీ నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పాత గ్రామం మునిగిపోవడంతో, దేవాలయాన్ని కొత్తపేట గ్రామ శివారులో తిరిగి నిర్మించారు. ప్రస్తుతం ఇది భక్తుల నిత్య దర్శన క్షేత్రంగా మారింది.
ప్రతి సోమవారం హైదరాబాద్, నారాయణఖేడ్, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. వారి నమ్మకం ప్రకారం, ఈ స్వయంభూ శివలింగ దర్శనంతో కోరికలు తీరతాయని, పిల్లల కోసం కోరుకునేవారికి, పెళ్లిళ్ల కోసం ప్రార్థించేవారికి మనసు తీరుతుందని విశ్వాసం. ఆలయ పరిధిలో ఇటీవలే నిర్మించిన హనుమాన్ ఆలయం, శని దేవాలయం, రేణుక ఎల్లమ్మ ఆలయం, మదానంద స్వామి మఠం వంటివి కూడా భక్తుల ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఇలా ఒకే ప్రాంగణంలో ఐదు దేవాలయాలు ఉండటంతో భక్తులు ఇవన్నింటినీ దర్శించుకుని, స్వయంభూ శివలింగాన్ని దర్శించడాన్ని అదృష్టంగా భావిస్తున్నారు. ఇక్కడి భక్తులు చెబుతున్నట్టు, ఇలాంటి స్వయంభూ శివలింగాన్ని, అంతగా పవిత్రత కలిగిన ప్రదేశాన్ని వేరే ఎక్కడా చూడలేమని వారు గర్వంగా చెబుతున్నారు. ఉమా సంగమేశ్వర దేవస్థానం, భక్తికి ప్రతీకగా, శివ మహిమకు జ్ఞాపకంగా నిలుస్తున్న ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రజల హృదయాల్లో పదిలమై ఉంది.
తెలంగాణలోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు తెలంగాణ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
మెదక్, తెలంగాణ
జూన్ 19, 2025 1:05 PM





















