చివరిగా నవీకరించబడింది:
తెలంగాణలో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నారు.
వేసవి సెలవుల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యా ప్రమాణాలు పెంపు లక్ష్యంతో విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాల పెంపునకు వీలుగా విద్య వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ఆదేశించారు. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 508 ప్రభుత్వ పాఠశాలలు, 307 ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి తెలిపారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు సర్కులర్ జారీ చేశారు. ఇందులో అనుమతులు లేకుండా పాఠశాలలు నడిపించవద్దని పొందుపరిచారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులందరికీ యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ అందజేశారు. అంతేకాకుండా ఈ సంవత్సరం నుంచి కొత్తగా ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సంవత్సరం విద్యార్థులకు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్‌లో ఏఐ అంశానికి సంబంధించిన చాప్టర్స్‌ను కూడా పొందుపరిచారు. మారుతున్న కాలానికి విద్యార్థులు కూడా టెక్నాలజీకి అనుగుణంగా మారాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
విద్యార్థులకు డిజిటల్ బోధన అందించాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 144 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ పేరుతో విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదులకు అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ప్రీ ప్రైమరీ స్కూల్స్ కూడా ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 16 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య బోధనను అందించనున్నారు. ఈ పాఠశాలల్లో నాలుగు సంవత్సరాలు పైబడిన విద్యార్థులను ఇందులో చేర్పించవచ్చన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించారు. జీవో నెంబర్ 1 ప్రకారం పాఠశాలలకు రికగ్నైజేషన్ సరైన అనుమతులు లేకపోతే పాఠశాలలను సీజ్ చేస్తున్నారు. ఇటీవలే నగరంలోని అనుమతి లేని రెండు ప్రైవేట్ పాఠశాలలను సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు తీసుకుంటూ తరగతులు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో విద్యాశాఖ అధికారులు రెండు పాఠశాలలపై తనిఖీ చేపట్టి సీజ్ చేసినట్లు తెలిపారు.
అనుమతులు లేకుండా పాఠశాలలు నడిపించడం తల్లిదండ్రుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రికగ్నైజేషన్ సరైన అనుమతులు లేనటువంటి పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించవద్దని తల్లిదండ్రులను కోరుతున్నారు. ఇలా అనుమతులు లేని పాఠశాలల్లో చేర్పించడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సరైన అనుమతులు ఉన్న పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలన్నారు.
వరంగల్, తెలంగాణ
జూన్ 18, 2025 3:11 PM





















