చివరిగా నవీకరించబడింది:
విజయనగరం పట్టణంలోని అయ్యన్న కోనేరు వద్ద ఉన్న ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని ఆంజనేయ విగ్రహం ప్రత్యేకత, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తుంది.
విజయనగరం పట్టణంలోని అయ్యన్న కోనేరు వద్ద వెలసిన ఆంజనేయ స్వామి దేవస్థానం.. ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం గట్టు మీద కొలువై ఉన్న మారుతి విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే.. పలాసకు చెందిన ప్రముఖ హరికథకుడు సుప్పల సూర్యనారాయణ టెక్కలిలో హరికథ చెప్పినప్పుడు, ఆ హరికథతో ఆకర్షితుడైన ఒక శిల్పి బాదం చెక్కతో ఆంజనేయ స్వామిని శిల్పంగా చెక్కి కానుకగా ఇచ్చారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ విగ్రహానికి రాగి తీగ గానీ, మేకుల గానీ ఎలాంటి ఆధారాలు లేవు. ఇది సామాన్య మానవులు తలపెట్టలేని కళా పటుత్వాన్ని కలిగిన కళాఖండంగా ఆలయ ప్రధాన అర్చకులు ఎం. దుర్గారావు పేర్కొన్నారు. ఆ విగ్రహాన్ని ఆదిపట్ల నారాయణదాసు, సుప్పల సూర్యనారాయణ కలిసి విజయనగరంలోని అయ్యన్న కోనేరు గట్టుపై ప్రతిష్టించారు. చిన్నపిల్లల మాదిరిగా కనిపించే ఆంజనేయుని చూసి ‘మారుతి భక్తమండలి’ అనే పేరును ఆలయానికి ఇచ్చారు.
ఈ ఆలయం ఒక సాంస్కృతిక కేంద్రంగా ఎదిగింది. సంగీత కళాకారులు, కవులు, వేద పండితులు, హరికథకులు ఇక్కడ హరికథలు చెబుతూ, సుందరకాండ పఠనం చేస్తుంటారు. ఒక చెట్టు మీద ప్రతి రోజు కోతి రూపంలో ప్రత్యక్షమయ్యే.. ఆంజనేయ స్వామి, ఉదయం మాత్రం కనిపించకుండా పోతాడని స్థానికులు చెబుతుంటారు. ప్రత్యేకంగా రామ-ఆంజనేయ కలయికను సూచించే రామకాండ ఘట్టంలో హరికథ జరిగినపుడు వర్షం కురుస్తుండటం ఈ ఆలయ విశిష్టతను మరింత పెంచింది. ఇక్కడి ఆంజనేయ స్వామి బాలరూపంలో ఉండి, రాత్రి సమయంలో ‘రామా రామా’ అంటూ స్వరభజనలు చేస్తూ వినిపిస్తారని, అది పుణ్యం కలిగినవారికే అనుభవించగలమని అర్చకులు తెలియజేశారు.
ఈ ఆలయంలో మొక్కులు వేసే వారు ఆరోగ్యంగా మారడం, వివాహాలే కాకుండా సంతానాన్ని పొందడం అనేక దేవానుగ్రహాలకు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. చాగంటి కోటేశ్వరరావుగారు కూడా ఈ ఆలయానికి వచ్చి, “ప్రపంచమంతా తిరిగినా ఇలాంటి హనుమ విగ్రహాన్ని నేను ఎక్కడా చూడలేదు అని ప్రశంసించడం ఈ దేవస్థాన మహిమాన్వితత్వానికి నిదర్శనం. చిన్న ఆలయం అయినప్పటికీ, ఇక్కడి ఆంజనేయ స్వామి పాదాలు, ముఖ స్వరూపం, భక్తులకు కలిగే ఆధ్యాత్మిక అనుభూతి ఈ ఆలయాన్ని అపూర్వంగా నిలబెట్టాయి. విజయనగరంలో ఉన్న ఈ పవిత్ర దేవస్థానాన్ని దర్శించడం ద్వారా మహా పుణ్యం లభిస్తుందని ఆలయ అర్చకులు ఎం. దుర్గారావు లోకల్ 18 ద్వారా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Vizianagaram,Andhra Pradesh
జూన్ 20, 2025 8:32 PM
























