చివరిగా నవీకరించబడింది:
హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్ రెడ్డి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బిఆర్ఎస్ నేతలు అరెస్టును ఖండించారు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హుజరాబాద్ బీఆర్ఎష్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి నేరుగా సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి శివారులో మనోజ్ రెడ్డి అనే వ్యక్తి క్వారీ నడుపుతున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మనోజ్ రెడ్డిని రూ.50 లక్షలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని.. మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఏప్రిల్ నెలలో ఫిర్యాదు చేసింది. దీంతో సుబేదారి పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
బిఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం కౌశిక్ రెడ్డిపై 308(2), 408(4), 352 సెక్షన్స్ కింద కేసు నమోదు చేసిన సుబేదారి పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుతో బిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సుబేదారి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టుతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కౌశిక్ రెడ్డి అరెస్టుపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. అతని అరెస్టు అప్రజాస్వామికం అన్నారు. సుబేదారి పోలీస్ స్టేషన్ వద్దకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, చల్ల ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి పలువురు నేతలు చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండించారు.
కౌశిక్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఆరు గ్యారెంటీల హామీల అమలుపై ప్రభుత్వం విఫలమైందంటూ కౌశిక్ రెడ్డి ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండడంతో ప్రశ్నించే గొంతును అణిచివేయాలనే ఉద్దేశంతో కావాలనే కక్షపూరితంగా తనపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
క్వారీలో జరుగుతున్న అక్రమాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తే తనపై కావాలనే కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టి ఇలా అరెస్టు చేయడం సరికాదని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. సుబేదారి పోలీస్ స్టేషన్ లో కౌశిక్ రెడ్డి విచారణ అనంతరం ఆయనకు వరంగల్ ఎంజీఎంలో వైద్య పరీక్షలు చేశారు. అనంతరం రైల్వే కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టారు. కౌశిక్ రెడ్డికి బెయిల్ వస్తుందా రాదా అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ అతనికి బెయిల్ రాకపోతే 14 రోజుల రిమాండ్ విధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు తెలంగాణ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
వరంగల్, తెలంగాణ
జూన్ 21, 2025 5:40 PM
























