
మీడియా ప్రతినిధి – ఒంగోలు: యువత వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసిన జిల్లా ఎస్పీ గారు.
యువత తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు, యువత తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉద్యోగాలు చేసుకొని కుటుంబానికి అండగా నిలబడాలి: జిల్లా ఎస్పీ గారు.
వృత్తి నైపుణ్యం పెంచుకుని స్వయం ఉపాధివైపు యువతను తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన PVNR ప్రైవేట్ గ్రూప్ వారి సౌజన్యంతో తేదీ. 16.03.2025న యర్రగొండపాలెంలో నిరుద్యోగ యువతకై నిర్వహించిన జాబ్ మేళాకు హాజరై వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైన 32 మందికి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు నియామక పత్రాలు అందజేశారు.
జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ నిరుద్యోగ యువతను ఉపాధి వైపు నడిపించేందుకు ఈ జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా తిరుపతిలోని గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ కంపెనీకి 5 మంది, వైజాగ్ లోని లింగువా ఫ్రాంకా సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ కంపెనీకి 10 మంది, హైదరాబాద్ లోని జొమాటో వేర్ హౌస్ కంపెనీకి 17 మందికి అన్ని ఉచిత సదుపాయాలతో నెలకు రూ.15000 నుండి రూ. 20,000 కనీస వేతనంతో ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు.

ఉద్యోగాలు పొందిన వారు జీతం ఎంత వస్తుందనే అంశంపైన డిసిషన్ ఉండకూడదని, మొదట చిన్న ఉద్యోగం అని తేలికగా తీసుకోకుండా కష్టపడి పనిచేయడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవడంతో పాటు ఏ ప్రాంతంలో అయిన పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఉద్యోగం రావడమే ముఖ్యం కాదని అందులో రాణించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. తమ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగి పది మందికి ఆదర్శంగా నిలవాలన్నారు.
యువత తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏది లేదని, యువతీ యువకులు తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉద్యోగాలు చేసుకొని కుటుంబానికి అండగా నిలబడాలని సూచించారు. మనకు నచ్చిన వృత్తి నైపుణ్యం ఉన్నా రంగాల్లో ఉద్యోగాలు చేయడం చాలా ఉత్తమమని అన్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత మిగతావన్నీ వాటంతట అవే మన దగ్గరకు వస్తాయని అభిప్రాయపడ్డారు.
చదువుకున్న యువత మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ పడాలని, సాఫ్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారికి అధిక శాలరీ ఆఫర్ చేసేందుకు ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జిల్లాలో యువతను సన్మార్గంలో పయనింపజేసేందుకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మున్ముందు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

ప్రతి ఒక్కరికీ ఉద్యోగం చేయాలనే తాపత్రయం ఉంటుంది కానీ ఏ ఉద్యోగం చేయాలని ఎవరు నమ్మాలో తెలియక చాలామంది మోసపోతుంటారని, ఎవరైనా డబ్బులకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పితే నమ్మవద్దని సూచించారు.
ఈ జాబ్ మేళాను విజయవంతం చేయడంలో కృషి చేసిన పోలీస్ అధికారులు, PVNR ప్రైవేట్ గ్రూప్ సీఈఓ పి. గోపీచంద్ మరియు సిబ్బందికి జిల్లా ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు.
























