చివరిగా నవీకరించబడింది:
వేములవాడ పట్టణంలో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాను బీజేపీ నేతలు ఉచితంగా నాలుగు షోలు ప్రదర్శించగా, ప్రజలు భారీగా హాజరై ఆనందంగా వీక్షించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమాను వేములవాడ పట్టణంలో నాలుగు షోలు ఫ్రీగా ప్రదర్శిస్తున్నట్లు బిజెపి నేతలు తెలిపారు. అసలు ఈ సినిమాను ఉచితంగా ప్రదర్శించడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను మీడియాకు వెల్లడించారు. ఉచితంగా హరిహర వీరమల్లు సినిమాను ప్రదర్శిస్తున్నట్లు ప్రచారం చేయడంతో స్థానిక ప్రజలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పట్టణంలోని శివరామకృష్ణ టాకీస్‌కు చేరుకొని పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమాను చూసి తరించారు. ఈ ఉచిత ప్రదర్శన కార్యక్రమాన్ని బిజెపి పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్షులు, బీజేపీ స్టేట్ లీడర్ ప్రతాప రామకృష్ణ టికెట్లను పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
హరిహర వీరమల్లులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్యద్భుతంగా నటించారని, హిందూ సనాతన ధర్మం భావితరాలకు అందించే విధంగా ఈ సినిమా రూపొందించడం అభినందనీయమన్నారు. అందరూ ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరారు. వేములవాడ పట్టణ బిజెపి అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ.. పట్టణంలో నాలుగు షోలు ఉచితంగా ప్రదర్శిస్తున్నామని హరిహర వీరమల్లు సినిమా సందేశాత్మకంగా సనాతన ధర్మం అద్దం పట్టే విధంగా ఉందని అన్నారు.
మెగా అభిమాని మారం ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ.. మెగా అభిమానిగా ఈ సినిమాను వేములవాడ పట్టణానికి తీసుకువచ్చి గత కొన్ని రోజులుగా ప్రదర్శిస్తున్నానని, అయితే వేములవాడ పట్టణ బిజెపి నాయకులు నాలుగు షోలను ప్రజలందరికీ ఉచితంగా ప్రదర్శించేందుకు తనను సంప్రదించడం.. తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ఉచితంగా నాలుగు షోలను వేములవాడ పట్టణంలో హరిహర వీరమల్లు సినిమాను ప్రదర్శిస్తున్నామని ప్రజలందరూ ఈ సినిమాను వీక్షించాలని కోరారు.
వేములవాడ పట్టణ బిజెపి నాయకులు బచ్చు వంశీకృష్ణ ఈ సినిమాను వేములవాడలో నాలుగు షోలు ఉచితంగా ప్రదర్శించేందుకు ముందుకు రావడం, ఉచిత ప్రదర్శన నేపథ్యంలో బిజెపి నాయకులు కటకం శ్రీనివాస్, రాపల్లి శ్రీధర్‌లు, సీనియర్ బిజెపి నాయకులు ప్రతాప రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా.. మంచి ఆలోచన అని, ఈ సినిమాలో హిందూ సనాతన ధర్మం భావితరాలకు అందించే విధంగా ఉందని, ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి హిందూ సనాతన ధర్మం గురించి చెప్తూ హరిహర వీరమల్లు సినిమాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో గొప్పగా నటించారన్నారు. అయితే తెలంగాణలో కరీంనగర్ ఎంపీ కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు ఆయా రాష్ట్రాల్లో హిందూ సనాతన ధర్మం కోసం కంకణం కట్టుకొని పనిచేస్తుంటే.. భారతదేశంలో సనాతన హిందూ ధర్మం గొప్పతనం ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ పని చేస్తున్నారని స్పష్టం చేశారు.
సిర్సిల్లా, కరీంనగర్, తెలంగాణ
జూలై 30, 2025 5:40 PM
























