చివరిగా నవీకరించబడింది:
రక్షాబంధన్ అనేది అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా జరుపుకునే పండుగ. రాఖీ పౌర్ణమి నాడు రాఖీ కట్టి, ప్రేమ, భద్రత, విశ్వాసం వంటి విలువలను గుర్తు చేస్తుంది.
ప్రతి సంవత్సరం అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా రక్షాబంధన్ జరుపుకుంటారు. శ్రావణ మాస పౌర్ణమి నాడు వచ్చే రాఖీ పౌర్ణమికి 15 రోజుల ముందు నుంచే హడావుడి కనిపిస్తుంది. అయితే చాలావరకు అసలు ఈ పండుగ ఎందుకు వస్తుందో తెలియదు. రక్షాబంధన్ అనేది రాక్షసుల నుండి కాపాడడం కోసమే ఈ రక్షాబంధన్. ఇది రాఖీ పండుగగా ప్రాచుర్యం పొందింది. అన్నాచెల్లెళ్లకు ఎటువంటి చిన్నచిన్న మనస్పర్థలు ఉన్నా గానీ కనీసం ఈ పండక్కైనా మనస్పర్థలు తొలగిపోయి కలిసిమెలిసి మెలగాలని రాఖీ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అని సూర్యపేటకు చెందిన పురోహితులు వావిరాల రామలింగయ్య శర్మ లోకల్18 ద్వారా తెలియజేశారు.
వివరాల్లోకెళ్తే… రాఖీ పౌర్ణమి (రక్షాబంధన్) హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగను సోదరీసోదరీమణుల మధ్య ఉన్న ప్రేమ బంధానికి గుర్తుగా జరుపుకుంటారు. రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారు అంటే రాఖీ అనే దారాన్ని అక్కా లేదా చెల్లెలు తన సోదరుడి చేతికి కడుతుంది. ఇది ఒక రక్షణ దారం. దీని వలన తన తమ సోదరుడు సుఖంగా ఉండాలని, ఆయుష్మంతుడిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తారు అక్కాచెల్లెళ్లు. అన్నయ్య, తన చెల్లెలును ఎల్లప్పుడూ రక్షిస్తానని ఇటువంటి కష్టాలను దరి చేరకుండా చూస్తాడని చెల్లెళ్లకు నమ్మకం అని అన్నారు.
కురుక్షేత్ర యుద్ధం ముందు ఒక సందర్భంలో శ్రీకృష్ణుడు తన చేతి వ్రేలిని కత్తి ద్వారా కోసుకుంటాడు. అది చూసిన ద్రౌపది వెంటనే తన చీరను చింపి, ఆయన గాయం కప్పి రక్తం ఆపుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ సహాయాన్ని మర్చిపోనని, అవసరమైనప్పుడు ఆమెను రక్షించానని ప్రమాణం చేస్తాడు. ఈ కథ ఆధారంగా, ద్రౌపది శ్రీకృష్ణుడికి రాఖీ (లేదా రక్షాబంధనం) కట్టినట్టు భావిస్తారు. ఇది రాఖీ పండుగకు ఒక మానవీయ, శ్రేయస్సు కలిగిన ఉదాహరణగా చెబుతుంటారు. ఒక సోదరి తన సోదరుని రక్షణ కోరుతూ రాఖీ కడుతుంది, సోదరుడు ఆమెను ఎప్పుడూ రక్షిస్తానని హామీ ఇస్తాడు.
రాఖీ పండుగ వెనుక మరో జానపద కథ కూడా ప్రచారంలో ఉంది. రాణి కర్ణావతి మెవార్‌లోని చిత్తోర్‌గఢ్‌కు రాజమాత. ఆమె రాజ్యాన్ని గుజరాత్ సుల్తాను బహదూర్ షా నుండి రక్షించుకోవాలన్న ఉద్దేశంతో మొఘల్ చక్రవర్తి హుమాయున్ సహాయం కోరుతుంది. కర్ణావతి, హుమాయున్‌కు ఒక రాఖీ పంపించినట్లు కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. అతడిని తన అన్నగా పరిగణిస్తూ, తనను రక్షించాలని కోరుతుంది. హుమాయున్, ముస్లిం అయినప్పటికీ, రాఖీ భావనను గౌరవిస్తూ వెంటనే తన సేనతో బయలుదేరి ఆమెకు సహాయం చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఇలా రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి.
రాఖీ పండుగను శ్రావణ మాస పౌర్ణమి నాడు జరుపుకుంటారని మనకు తెలుసు. ఈ సంవత్సరం ఆగస్టు 9న రాఖీ పండుగ జరుపుకుంటారు. కొంతమంది శుభ ఘడియలు చూసి మరీ రాఖీ కడుతుంటారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి వరకు ఎప్పుడైనా కట్టవచ్చు అని పురోహితులు చెబుతున్నారు. రాఖీ కట్టిన సందర్భంగా బహుమతులు, మిఠాయిలు అన్నాచెల్లెలు ప్రేమ ఆప్యాయతగా ఇచ్చిపుచ్చుకుంటారు. కుటుంబ సంబంధాలు బలపడే రాఖీ పండగ ఇది పరిగణించబడుతుంది అని తెలిపారు. ఈ పండుగ అనేది మానవ సంబంధాలలో ప్రేమ, భద్రత, విశ్వాసం అనే విలువలను గుర్తు చేస్తుంది అని పురోహితులు వావిరాల రామలింగయ్య శర్మ లోకల్ 18 ద్వారా తెలియజేశారు.
నల్గోండా, తెలంగాణ
జూలై 30, 2025 4:54 PM
























